నా కళ్లెదుటే 20 మంది విద్యార్థుల వీసాలు తిరస్కరించారు: ఓ విద్యార్థి ఉత్కంఠభరిత అనుభవం

  • ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో పొందిన అనుభవాన్ని పంచుకున్న హరికృష్ణ
  • కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వకుండా 20 మంది వీసాలను వరుసగా రిజెక్ట్ చేశారని వెల్లడి
  • కారణం కూడా చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారన్న హరికృష్ణ

అమెరికాలో మాస్టర్స్ చేయాలనుకునే ప్రతీ భారతీయ విద్యార్థి లైఫ్‌లో అత్యంత టెన్షన్ పుట్టించే ఘట్టం.. F-1 వీసా ఇంటర్వ్యూ. ముంబైలోని యూఎస్ కాన్సులేట్‌లో తాజాగా వీసా పొందిన అహ్మదాబాద్‌కు చెందిన హరికృష్ణ త్రివేది అనే విద్యార్థి పంచుకున్న అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో, స్టూడెంట్ సర్కిల్స్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది.


న్యూజెర్సీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NJIT) లో మాస్టర్స్ కోసం వెళుతున్న త్రివేది, తాను వీసా సాధించిన తీరును, అక్కడ కళ్లారా చూసిన టెన్షన్ వాతావరణాన్ని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో  వివరించాడు.


త్రివేది ముంబై కాన్సులేట్‌కు వెళ్ళినప్పుడు, అతని కంటే ముందు క్యూలో ఉన్న 20 మంది విద్యార్థుల అప్లికేషన్లు వరుసగా రిజెక్ట్ అయ్యాయి. వీసా ఆఫీసర్లు అభ్యర్థులకు కనీసం కొన్ని సెకన్ల సమయం కూడా ఇవ్వలేదని, విద్యార్థులు తమ ఇంట్రడక్షన్ మొదలుపెట్టే లోపే మధ్యలో ఆపి.. ఎటువంటి నిర్దిష్ట కారణం చెప్పకుండా రిజెక్షన్ లెటర్ చేతిలో పెట్టారని త్రివేది చెప్పాడు. "వాళ్లు విండో దగ్గరకు రాకముందే వీసా ఆఫీసర్లు అప్లికేషన్‌ను రిజెక్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు అనిపించింది. కేవలం ఆరు ముక్కలు మాట్లాడే లోపే రిజెక్ట్ అవ్వడం చూసి నాది కూడా పోయినట్టే అని మానసికంగా ఫిక్స్ అయిపోయాను" అని త్రివేది ఆ టెన్షన్ క్షణాలను గుర్తుచేసుకున్నాడు.


లంచ్ టైమ్ దగ్గర పడుతుండటంతో త్రివేది ఆ క్యూలో చిట్టచివరి క్యాండిడేట్‌గా మిగిలాడు. అతని కంటే బెటర్ యూనివర్సిటీల సీట్లు సాధించిన వారే రిజెక్ట్ అవ్వడంతో త్రివేది ఆశలు వదిలేసుకున్నాడు. విండో దగ్గరకు వెళ్లగానే ఆఫీసర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు. త్రివేది సగం చెప్పేలోపే ఆపి, అత్యంత కీలకమైన ప్రశ్న వేశారు. నిన్ను ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... "మా నాన్న స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకు సొంత బిజినెస్ ఉంది. ఎడ్యుకేషన్ లోన్ ద్వారా నా చదువుకు ఖర్చు భరిస్తున్నారు" అని త్రివేది చెప్పారు.


ఆ వెంటనే వీసా ఆఫీసర్ అత్యంత ప్రమాదకరమైన ప్రశ్న వేశారు. 'నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి?' (యుఎస్ వీసా ఇంటర్వ్యూలో దీనిని మోస్ట్ డ్రెడెడ్ క్వశ్చన్ అంటారు, ఎందుకంటే చదువు అయిపోయాక అక్కడే ఉండిపోతామనే సిగ్నల్ వస్తే వీసా రిజెక్ట్ అవుతుంది). ఈ ప్రశ్నకు త్రివేది స్పందిస్తూ... "నేను అమెరికాలో మాస్టర్స్ చేసి అవసరమైన స్కిల్స్ నేర్చుకుంటాను. ఆ తర్వాత తిరిగి భారతదేశానికి వచ్చి మా నాన్న బిజినెస్‌లో జాయిన్ అవుతాను. మా నాన్నది హెల్త్‌కేర్ సెక్టార్ బిజినెస్, అందుకే నేను 'ఏఐ ఇన్ హెల్త్‌కేర్' చదవాలనుకుంటున్నాను" అని చాలా స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా సమాధానం ఇచ్చాడు.


త్రివేది సమాధానంతో సంతృప్తి చెందిన వీసా ఆఫీసర్.., అతని సోషల్ మీడియా ఖాతాల వివరాలను డిక్లేర్ చేయడం కోసం 221(g) ఫామ్ చేతిలో పెట్టి వీసా అప్రూవ్ చేశారు. అంతకుముందు 20 మందిని వరుసగా రిజెక్ట్ చేసిన అదే ఆఫీసర్, తన వీసాను అప్రూవ్ చేయడాన్ని త్రివేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాడు.

Harikrishna Trivedi
US Visa Interview
F1 Visa
Student Visa Rejection
Study in USA
Masters in USA
NJIT
New Jersey Institute of Technology
AI in Healthcare
USA Student Visa

More Telugu News